Saturday, September 20, 2014

పిల్లలకు ఎంతనిద్ర అవసరమో తెలియజేయండి?

  •  
 

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

Q : పిల్లలకు ఎంతనిద్ర అవసరమో తెలియజేయండి?

Ans : నిద్ర ఎవరికైనా అవసరం, పిల్లలకు మరీ అవసరం.పిల్లల నిద్ర విషయంలో ఎంతసేపు నిద్రపోతున్నారనే దానికన్నా ఎంత గాఢంగా, కమ్మగా నిద్రపోతున్నారనేదే ముఖ్యం. పిల్లలు మధ్యలో నిద్రలేస్తున్నారా?లేస్తే మళ్లీ పడుకోబెట్టటానికి కష్టమవుతోందా? పొద్దున్నే వేళకు లేవటం లేదా? అనేవి ముఖ్యం. సరిగా నిద్రపోని పిల్లల్లో చిరాకు కూడా ఎక్కువగా ఉంటుంది. రాత్రివేళ నాణ్యమైన నిద్ర లేకపోతే, పొద్దున లేవటానికి కూడా ఇబ్బందులు ఉంటాయి. పదిపన్నెండేళ్ల వయసు పిల్లలు త్వరగా పడుకోరు. రాత్రి పన్నెండు గంటలదాకా కంప్యూటర్‌ గేమ్స్‌, టీవీలు, సినిమాలు చూడటం వంటివాటిలో గడిపేస్తారు. ఇవన్నీ నిద్ర నాణ్యతను దెబ్బతీసేవే. కొంతమంది నిద్ర మధ్యలో తరచూ లేచి ఏడుస్తుంటారు.ఇలాంటివారిలో నాణ్యమైన నిద్ర లేకపోవటం వల్ల పగలు నిద్రపోవాల్సిన అవసరం తలెత్తుతుంది. ఫలితంగా తరగతి గదిలో కునికిపాట్లు, పాఠాలపై శ్రద్ధ పెట్టకపోవటం, నేర్చుకునే సామర్థ్యం బలహీనపడుతుంది. జ్ఞాపకశక్తి, విషయగ్రాహ్య శక్తీ తగ్గుతుంది. ఇలాంటి పిల్లల్లో  కోపం, పిచ్చిపిచ్చిగా, అతిగా ప్రవర్తించటం వంటివి ఎక్కువవుతాయి. ఇవన్నీ ప్రవర్తన సంబంధ సమస్యలు. వీటన్నింటి ఫలితంగా మార్కులూ తగ్గుతాయి. ఇలాంటి లక్షణాలన్నింటినీ ప్రదర్శించే పిల్లలు రాత్రివేళల్లో సక్రమంగా నిద్రపోతున్నారా? అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది.

శిశువులు 3నెలలు వచ్చేవరకు రోజులో కనీసం 18-20 గంటలైనా విడతలవారిగా నిద్రపోవాలి . మధ్యమధ్యలో పాలు తాగటానికి లేవటం, మళ్లీ పడుకోవటం.. ఇలా ఉంటుంది వాళ్ల నిద్రశైలి. వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర అవసరం తగ్గుతుంటుంది.

మూడు నెలల నుంచి ఏడాది వయసు పిల్లలు రోజులో 14 -15 గంటలు నిద్రపోవాలి .

2- 4 ఏళ్ల వయసు పిల్లలు రోజులో సుమారు 12 గంటలు నిద్రపోవాలి .

స్కూలుకెళ్లే వయసు (5-9 ఏళ్లు) పిల్లలు కనీసం 10-12 గంటలైనా నిద్రపోవాలి.

యుక్తవయసు వచ్చేసరికి పిల్లల్లో నిద్ర అవసరం తగ్గినా, వీళ్లుకూడా కనీసం 9 గంటలైనా పడుకోవాలి.

ఇక యుక్తవయసు దాటిన పెద్దవాళ్లు రోజులో 6-8 గంటలు పడుకున్నా సరిపోతుంది.
.
వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో పగటినిద్ర తగ్గినా ఏడాది వయసు పిల్లలు పగటివేళ కనీసం మూడు గంటలైనా నిద్రపోవాలి . మిగతా పదీ పదకొండు గంటలు రాత్రివేళలో పడుకోవాలి .

  • *=========================== 
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.