Thursday, September 18, 2014

రక్తపోటు పరీక్ష రెండు చేతులకూ చేయాలా?,రెండుచేతులకూ ఉన్న రక్తపోటు లో తేడా ఎక్కువ ఉంటే ప్రమాదమా?

  •  
 

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .
 ప్ర : రక్తపోటు పరీక్ష రెండు చేతులకూ చేయాలా?,రెండుచేతులకూ ఉన్న రక్తపోటు లో తేడా ఎక్కువ ఉంటే ప్రమాదమా?

జ : మనం ఏ సమస్యతో వెళ్లినా డాక్టర్లు రక్తపోటు పరీక్ష కూడా చేస్తుంటారు. దీంతో రక్తపోటు ఎక్కువగా ఉంటే బయటపడుతుంది. ఇక అప్పటికే హైబీపీతో బాధపడుతుంటే రక్తపోటు అదుపులో ఉందో లేదో తెలుస్తుంది. అయితే రక్తపోటు పరీక్షను ఒక చేయికి కాకుండా.. రెండు చేతులకూ చేయటం మంచిదని బ్రిటన్‌ పరిశోధకులు సూచిస్తున్నారు. ఎందుకంటే కుడి చేయి, ఎడమ చేయిలో రక్తపోటు కొలతల మధ్య తేడా ఎక్కువగా ఉండటమనేది పక్షవాతం, గుండె రక్తనాళాల జబ్బు, గుండెకు దూరంగా ఉండే అవయవాల్లో రక్తనాళాల సమస్యలకు (పెరిఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌) సూచిక కావొచ్చు. రెండు కొలతల మధ్య 15, అంతకన్నా ఎక్కువ పాయింట్ల తేడా గలవారికి పెరిఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌ ముప్పు రెండు రెట్లు అధికంగా ఉంటున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం. ఈ కొలతల్లో 10-15 పాయింట్ల వ్యత్యాసం గలవారికి పక్షవాతం లేదా గుండె జబ్బు మూలంగా మరణించే ముప్పూ పెరుగుతున్నట్టు బయటపడింది.

ఎందుకీ తేడా?
నిజానికి రెండు చేతుల్లోనూ రక్తపోటు కొలతల్లో కొంత తేడా ఉండటం సహజమే. దీనికి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. కానీ ఈ తేడా 10 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇంతకీ రెండు చేతుల్లో రక్తపోటు కొలతల్లో వ్యత్యాసం ఎందుకు కనబడుతుంది? యువకుల్లోనైతే.. చేతికి రక్తసరఫరా చేసే ధమనిని కండరం గానీ మరేదైనా గానీ నొక్కినపుడు లేదా రక్తసరఫరా సరిగా జరగకుండా నిరోధించే నిర్మాణలోపం వంటివి దీనికి కారణమవుతాయి. మధ్యవయసువారిలో, వృద్ధుల్లోనైతే.. రక్తనాళాల్లో పూడిక ఏర్పడటం వల్ల ఇలా రెండు చేతుల్లో రక్తపోటు కొలతల్లో వ్యత్యాసం కనబడుతుంది. అరుదుగా మరికొందరిలో బృహద్ధమని కవాటంలో చీలిక తలెత్తినా కొలతల్లో తేడాలు వస్తాయి. అందువల్ల ఈసారి రక్తపోటు పరీక్ష చేయించుకునే సమయంలో రెండు చేతులకూ చేయించుకోవటం మరచిపోకండి. అలాగే రక్తపోటు పరీక్ష చేయించుకోవటానికి 30 నిమిషాల ముందుగా కెఫీన్‌, మద్యం, నికోటిన్‌ వంటివి తీసుకోవద్దనీ గుర్తుంచుకోండి. కొద్ది నిమిషాల సేపు ప్రశాంతంగా కూచోవాలి కూడా. ఇక పరీక్ష కోసం చేతిని ముందుకు చాచినపుడు మోచేయి గుండెకు సమానమైన ఎత్తులో ఉండేలానూ చూసుకోవాలి.

  •  *=========================== 

 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.