Thursday, September 18, 2014

Any health problem if ovary removed ?,ఆపరేషన్‌ తో అండాశయాలు తీసివేస్తే నష్టమా?

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .

 Q : ఆపరేషన్‌ తో అండాశయాలు తీసివేస్తే నష్టమా?

Ans : మెనోపాజ్‌ అనంతరం అండాశయాలతో ఎలాంటి ప్రయోజనమూ ఉండదని భావిస్తుంటారు. అందుకే గర్భసంచిని తొలగించే శస్త్రచికిత్స (హిస్టెరెక్టమీ) చేసే సమయంలో చాలామందికి అండాశయాలనూ తొలగిస్తుంటారు. కానీ వీటిని కాపాడుకోవాల్సిన అవసరముందని, అకారణంగా తొలగించొద్దని తాజా అధ్యయనం సూచిస్తోంది. నెలసరి నిలిచిపోవటం (మెనోపాజ్‌) కన్నా పదేళ్ల ముందుగా అండాశయాల తొలగింపు శస్త్రచికిత్స చేయించుకున్న వృద్ధ మహిళలకు ఎముక క్షీణత ముప్పు రెండు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. ముఖ్యంగా తుంటి, నడ్డిపూస (లంబార్‌ స్పైన్‌), తొడ ఎముక ముందుభాగంలో ఎముక సాంద్రత గణనీయంగా తగ్గుతున్నట్టు వెల్లడైంది. అంతేకాదు.. గుండె రక్తనాళాలు గట్టిపడటమూ అధికంగానే ఉంటున్నట్టు తేలింది. అండాశయ క్యాన్సర్‌ ముప్పు లేనివారికి హిస్టెరెక్టమీ చేసే సమయంలో అండాశయాలను తొలగించాల్సిన అవసరం లేదని, దీంతో మెనోపాజ్‌ అనంతరం మంచి ఫలితాలు ఉంటాయని గతంలో చేసిన పరిశోధనలూ సూచించాయి. తాజా అధ్యయనం ఈ వాదనకు మరింత బలం చేకూర్చింది. సాధారణంగా స్త్రీలకు వయసు పెరుగుతున్నకొద్దీ ముఖ్యంగా.. నెలసరి నిలిచిపోయిన తర్వాత ఎముకలు గుల్లబారటం (ఆస్టియోపొరోసిస్‌), గుండెజబ్బుల ముప్పులు పెరుగుతుంటాయి. ఇందుకు హార్మోన్ల స్థాయిలు పడిపోవటం దోహదం చేస్తుంది. నిజానికి మెనోపాజ్‌లో హార్మోన్ల మోతాదులు క్రమంగా తగ్గుతుంటాయి. కానీ అండాశయాల తొలగింపు శస్త్రచికిత్స చేయించుకున్నవారిలో వీటి స్థాయులు హఠాత్తుగా పడిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో సమస్యలూ ముందుగానే దాడి చేయటానికి ఆస్కారం కలుగుతోందన్నమాట. వృద్ధ మహిళల్లో అండాశయ క్యాన్సర్‌తో మరణించే వారితో పోలిస్తే.. గుండెజబ్బు, ఎముకలు గుల్లబారటం మూలంగా మంచానికి పరిమితమయ్యేవారి సంఖ్యే అధికం. అందువల్ల ఏ వయసులోనైనా గర్భసంచి తొలగించాల్సిన అవసరమొస్తే.. అండాశయ క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌ ముప్పులు లేనివారికి అండాశయాలను అలాగే ఉంచటం మంచిదని సదరన్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన సారా జె.మకౌస్కీ చెబుతున్నారు.
  •  *=========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.