Tuesday, August 26, 2014

Free Radicals-విశృంఖల కణాలు (ఫ్రీ ర్యాడికల్స్‌)

  •  

  •  
ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


ప్ర : విశృంఖల కణాలు అంటే?
జ : క్యాన్సర్లు, గుండెజబ్బు, పక్షవాతం వంటి జబ్బుల విషయంలో విశృంఖల కణాల (ఫ్రీ ర్యాడికల్స్‌) ప్రస్తావన తరచుగా వినబడుతుంటుంది. అందుకే ఇటీవలి కాలంలో పరిశోధకులు వీటిపై ఎన్నో అధ్యయనాలు చేస్తున్నారు కూడా. ఇంతకీ విశృంఖల కణాలంటే ఏంటి? ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? మనకు ఎలా హాని చేస్తాయి?

మన శరీరంలో నిరంతరం రకరకాల జీవక్రియలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని కణాలు దెబ్బతిని ఒక ఎలక్ట్రాన్‌ను కోల్పోటం గానీ మరో దాన్ని జోడించుకోవటం గానీ జరగొచ్చు. దీంతో వాటి స్వభావం మారిపోయి ఒకచోట స్థిరంగా ఉండకుండా యథేచ్ఛగా శరీరమంతా తిరుగాడుతుంటాయి. ఇవే విశృంఖల కణాలు. జీవక్రియల క్రమంలోనే కాదు.. ఎక్స్‌రేలు, ఓజోన్‌, సిగరెట్‌ పొగ, గాలిలోని కాలుష్య కారకాలు, పారిశ్రామిక రసాయనాల వంటి పర్యావరణ అంశాలు కూడా ఈ ఫ్రీ రాడికల్స్‌ పుట్టుకురావటానికి దోహదం చేస్తాయి. ఇన్‌ఫెక్షన్‌, వాపు, వ్యాయామం చేస్తున్న సమయంలోనూ వీటి ఉత్పత్తి పెరుగుతుంటుంది.

  • 'దొంగ' కణాలు
విశృంఖల కణాల్లో తగినంత శక్తి ఉండదు. అందువల్ల ఇవి ఇతర కణాల మీద దాడి చేసి తమకు కావాల్సిన శక్తిని లాగేసుకుంటాయి. ఇలా ఇవి డీఎన్‌ఏను దెబ్బతీయటంతో పాటు ప్రోటీన్‌ నిర్మాణానికి, కణాల పైపొరకూ హాని కలగజేస్తాయి. ఇది కీళ్లనొప్పులు, రక్తనాళాల వాపు, కిడ్నీల్లో వడపోతను నిర్వహించే భాగాల్లో వాపు, ల్యూపస్‌, ఎంఫసీమా, గ్యాస్ట్రిక్‌ అల్సర్లు, అధిక రక్తపోటు, రక్తనాళాల్లో పూడిక, క్యాన్సర్‌, పార్కిన్సన్స్‌ జబ్బు, అల్జీమర్స్‌, వూబకాయం వంటి రకరకాల సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా విశృంఖల కణాల్లో ఆర్‌వోఎస్‌ (రియాక్టివ్‌ ఆక్సిజన్‌ స్పిసీస్‌) రకం కణాలు రక్తనాళాల్లో పూడికను చిన్న చిన్న ముక్కలుగా చేసి శరీరమంతా వ్యాపించేలా చేస్తాయి. ఇది గుండెజబ్బు, పక్షవాతం వంటి సమస్యలకు కారణమవుతుంది.

  • యాంటీఆక్సిడెంట్లతో కళ్లెం
విశృంఖల కణాల మూలంగా దెబ్బతిన్న లేదా ముక్కలైన డీఎన్‌ఏను బీటాకెరోటిన్‌, ల్యూటిన్‌, లైకోపేన్‌, సెలీనియం, విటమిన్‌ ఏ, విటమిన్‌ సి, విటమిన్‌ ఇ వంటి పోషకాలు, విటమిన్ల రూపంలోని యాంటీఆక్సిడెంట్లు ఎప్పటికప్పుడు తొలగిస్తుంటాయి. ఇవి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, వూదా వంటి రంగురంగుల పండ్లు, కూరగాయల ద్వారా లభిస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు వేడిని తట్టుకోలేవు కాబట్టి పండ్లు, కూరగాయలను పచ్చిగా తింటే వీటిని ఎక్కువ మొత్తంలో లభించేలా చూసుకోవచ్చు. రోజుకి 4-6 సార్లు పండ్లు, కూరగాయలు తీసుకునేవారికి క్యాన్సర్ల ముప్పు తక్కువని అధ్యయనాలు సూచిస్తున్నాయి. జీవనకాలమూ పెరుగుతుంది. ప్రస్తుతం యాంటీఆక్సిడెంట్ల మాత్రలు కూడా అందుబాటులో ఉన్నాయి కానీ వీటితో దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు పొగతాగేవారు బీటాకెరటిన్‌ను పెద్దమొత్తంలో తీసుకుంటే వూపిరితిత్తుల క్యాన్సర్‌ రావొచ్చు. మితిమీరిన విటమిన్‌ ఇ మూలంగా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు పెరగొచ్చు. ఇక విటమిన్‌ సి మోతాదు పెరిగితే మూత్రాశయ క్యాన్సర్‌ రావొచ్చు. అందువల్ల యాంటీఆక్సిడెంట్లను మాత్రల రూపంలో తీసుకోవటం కన్నా క్రమం తప్పకుండా వ్యాయామం, రోజుకి 40 నిమిషాల సేపు జాగింగ్‌ చేయటం, తరచుగా తాజా పండ్లు, కూరగాయలు తినటం, పొగ అలవాటు జోలికి వెళ్లకపోవటంతో పాటు పొగ తాగేవారి దగ్గర్లో ఉండకపోవటం వంటివి చేస్తే మేలు.

  • *===========================
 visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.