Saturday, December 24, 2011

కాపర్-టి వల్ల చాలా హెల్త్‌ప్రాబ్లమ్స్ వస్తాయంటారు నిజమేనా? ,Any health problems with copper T?



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


Q : నా వయసు 24. పెళ్లై నాలుగు నెలలు అవుతోంది. పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీ రావడంతో చదువుకు ఇబ్బందిగా ఉంటుందని అబార్షన్ చేయించుకున్నాను. మరో రెండేళ్ల వరకు పిల్లలు వద్దనుకుంటున్నాం. మా అత్తగారు వాళ్లు కాపర్-టి వాడమంటున్నారు. మా ఫ్రెండ్ కాపర్-టి వల్ల చాలా హెల్త్‌ప్రాబ్లమ్స్ వస్తాయని, అది అందరి శరీరతత్వానికి సరిపడదని, భవిష్యత్తులో పిల్లలు పుట్టకపోవడానికి అవకాశం కూడా ఉందని చెప్పింది. నిజమేనా? పిల్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? పిల్స్ ఎన్నాళ్లు వాడవచ్చు? దయచేసి చెప్పగలరు.

A : ఫ్యామిలీ ప్లానింగ్ లేదా పిల్లల మధ్య ఎడానికి అందుబాటులో ఉన్న కొన్ని పద్ధతులు వివరిస్తున్నాను.

మొదటిది: సేఫ్ పీరియడ్
రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చే స్ర్తీలలో అండం 11 రోజుల నుంచి 18 రోజుల మధ్య విడుదల అవుతుంది. అందుచేత ఆ రోజుల్లో భార్యభర్తల మధ్య ఎడం ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తపడవచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలలో, పీరియడ్స్ రెగ్యులర్‌గా రానివారిలో ఈ పద్ధతి అనువైనది కాదు.

రెండవది: బారియర్‌మెథడ్
పురుషులు వాడే కండోమ్స్ బారియర్‌లా పనిచేసి ఫ్యామిలీ ప్లానింగ్‌కి సహాయపడతాయి. దీనిలో ఉండే ఒక రకమైన రసాయనం వల్ల వీర్యకణాలు నిర్వీర్యం కావించబడి ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తాయి. స్ర్తీలకు కూడా అనువుగా ఉండే కండోమ్ అందుబాటులో ఉన్నా అవి అంతగా ప్రాచుర్యం పొందలేదు. వీటి వల్ల ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తపడగలిగినా ఫెయిల్యూర్ రేట్ కొంచెం ఎక్కువే.

మూడవది: గర్భనిరోధక మాత్రలు
ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ మాత్రలు క్రమబద్ధంగా ఇవ్వడం వల్ల అండం ఫర్టిలైజేషన్ కాకుండా తద్వారా ప్రెగ్నెన్సీ రాకుండా ఆపగలుగుతాం. కొద్దికాలం క్రితం ఇవి హై డోసులో ఇవ్వబడేవి. దాని వల్ల ఎన్నో ఇతర సమస్యలు స్ర్తీలు ఎదుర్కొనవలసి వచ్చేది. కాని ఈ కాలంలో చాలా లో డోస్ ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా దాదాపు లేనట్టే. వీటిని రోజూ ఒకటి చొప్పున 21 రోజుల పాటు వేసుకోవలసి ఉంటుంది. క్రమం తప్పకుండా వాడినట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చేందుకు ఎటువంటి అవకాశమూ ఉండదు. రెండేళ్ల దాకా ఏ సమస్యలు లేకుండా నిరాఘాటంగా వాడుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ కాలం వాడాలనుకున్నప్పుడు కొద్ది నెలలు గ్యాప్ ఇచ్చి మళ్లీ మొదలుపెట్టవచ్చు. ఈ పద్ధతి వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడమే గాక పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడం, పీరియడ్స్‌లో నొప్పి తగ్గడం, అధిక రక్తస్రావం కాకపోవడం.. వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

నాలుగవది: కాపర్-టి
సన్నటి కాపర్ తీగలను ’ఖీ’ ఆకారంలో ఉన్న ప్లాస్టిక్ పరికరంపై చుట్టి గర్భసంచిలో అమర్చుతాం. దీని నుంచి కాపర్ చాలా తక్కువ మోతాదులో నిరాఘాటంగా విడుదల అవుతూ ఉంటుంది. ఆ ప్రభావం చేత గర్భసంచిలో ప్రెగ్నెన్సీ నిలిచేందుకు అనువైన పరిస్థితి ఉండదు. ఇది మూడు నుంచి ఐదేళ్ల వరకు ప్రభావం చూపుతుంది. వద్దనుకున్నప్పుడు ఎప్పుడైనా తీయించుకోగల వీలు ఉంటుంది. ఇది కనీసం ఒక్క బిడ్డ అయినా ఉన్న స్ర్తీలలో బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం ఉండేలా చేసేందుకు మాత్రమే వాడతాం. ఇంకా పిల్లలే కలగని స్త్రీలలో ఈ పద్ధతిని సాధారణంగా వాడం.

ఐదవది: గర్భనిరోధక ఇంజెక్షన్లు
మూడు నెలలకు ఒకసారి ఈ ఇంజక్షన్ చేయించుకోవలసి ఉంటుంది. ఎంతకాలం గర్భం వద్దనుకుంటే అంతకాలం వీటిని వాడవచ్చు. అయితే వీటి వల్ల పీరియడ్స్ క్రమంగా రాకపోవడం, బ్లీడింగ్ ఇరెగ్యులర్‌గా అవడం, మానేసిన తర్వాత కూడా పీరియడ్స్ క్రమంగా రాకపోవడం... ఈ పద్దతిలో ఉన్న లోపంగా చెప్పుకోవచ్చు.

అందుచేత మీ విషయంలో కండోమ్స్ గాని లేదా గర్భనిరోధక మాత్రలు కాని సరైన పద్ధతులుగా సూచించగలుగుతాం.

  • =============================


visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.