Wednesday, April 27, 2011

బరువు తగ్గించుకునే ప్రయత్నాలు , DOs to reduce weight




ప్ర :
బరువు తగ్గించుకునే ప్రయత్నం లో ఎటువంటి చర్యలు తీసుకోవడం అవసరం ?

జ : వ్యాయామం చేస్తున్నా, ఆహార నియమాలు పాటిస్తున్నా బరువు తగ్గటం లేదని చాలామంది వాపోతుంటారు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంతగా దృష్టిపెట్టరు. బరువు తగ్గటానికి వ్యాయామం, ఆహార నియమాల వంటి వాటిని సరైన క్రమంలో చేయటం ఎంతో ముఖ్యం.

బరువును నియంత్రించే కొన్ని చర్యలు :

  • ఆహారపు అలవాట్లు ,
  • వ్యాయామము ,
  • తీసుకునే కేలరీల సంఖ్య ,
  • ఖర్చు చేస్తున్న కేలరీల సంఖ్య ,
  • నిద్ర ,
  • ఒత్తిడి ,
వ్యాయామ పద్ధతి*

వారానికి కనీసం 5-6 రోజులు వ్యాయామం చేయటం తప్పనిసరి. అదీ 30-45 నిమిషాల పాటు వేగంగానూ చేయాలి. ముందు నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా వేగం పెంచుకుంటూ వెళ్లాలి. మధ్యలో విశ్రాంతి తీసుకోవటమూ ముఖ్యమే. దీనివల్ల వ్యాయామం ఆపేసిన తర్వాత కూడా కేలరీలు ఖర్చు అవుతాయి.

నిద్రలేమీ కారణమే*

నిద్రలేమి కూడా బరువు పెరగటానికి దోహదం చేస్తుంది. తగినంత నిద్రలేకపోతే జీవక్రియలు మార్పు చెందుతాయి. ఇది అతిగా తినటానికి, స్థూలకాయానికి దారి తీస్తుంది. నిద్రలేమితో శరీరంపై పడే ఒత్తిడీ బరువు పెరగటానికి కారణమవుతుంది.

ఆరోగ్య సమస్యలతో*

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు.. ముఖ్యంగా థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం వల్ల జీవక్రియలు మందగిస్తాయి. ఇది బరువు పెరగటానికి బీజం వేస్తుంది. అధిక బరువు గలవారు నిపుణులతో థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. అవసరమైతే తగు చికిత్స తీసుకోవాలి.

మితాహారం మేలు*

బరువు తగ్గకపోవటానికి ఎక్కువగా తినటమూ ఒక కారణమే. అందువల్ల మితంగా ఆహారం తీసుకోవాలి. నిపుణుల సలహా మేరకు చేసే పనిని బట్టి శరీరానికి రోజుకు అవసరమైన పోషకాలు, కేలరీల ప్రకారం ఆహారాన్ని తీసుకోవాలి.

ఒత్తిడి ముప్పు*

అధిక బరువు, ఒత్తిడి ఒకదాంతో మరోటి ముడిపడి ఉన్నాయని మరవరాదు. నిరంతరం ఒత్తిడితో బాధపడేవారిలో కార్టిజోల్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి ఎక్కువవుతుంది. ఇది ఆకలి పెరగటానికే కాదు కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోవటానికీ దోహదం చేస్తుంది. రోజులో కొద్దిసేపు విశ్రాంతి పొందేలా చూసుకుంటూ ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.

క్రమం తప్పరాదు*

వ్యాయామం నుంచి చేసే పని వరకూ ఏదైనా క్రమం తప్పకుండా చూసుకోవాలి. చాలాసార్లు వ్యాయామం చేయటం మానుకుంటే తిరిగి పరిస్థితి మొదటికి చేరుకుంటుంది. కాబట్టి అలాంటి సమయాల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లటం, ఆటలు ఆడుతూ హాయిగా గడపటం అలవాటు చేసుకోవాలి.

మద్యానికి దూరం

ఏ రకం మద్యంలో నైనా కొవ్వు ఉండదు కానీ కేలరీలు మాత్రం ఉంటాయి. కాబట్టి మద్యం తాగినవెంటనే కేలరీలు ఖర్చయ్యేలా చూసుకోవటం మంచిది. లేకపోతే అవి బరువు పెరిగేలా చేస్తాయి. కూల్‌డ్రింకులు, సోడాలనూ అతిగా తాగరాదు. ఇవి రక్తంలోని చక్కెర మోతాదును కూడా పెంచుతాయి. వీటికి బదులుగా నీళ్లను తాగటం మేలు.

తిండి మానేస్తే చేటు
బరువు తగ్గటానికి చాలామంది మధ్యమధ్యలో తిండి తినటం మానేస్తుంటారు. దీనివల్ల కీడే ఎక్కువ. ఈ సమయంలో శరీరంలో అమైనో ఆమ్లం మోతాదును నియంత్రించుకోవటానికి కండరాలు క్షీణించటం ఆరంభిస్తాయి. దీంతో జీవక్రియలు మందగిస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం, తక్కువ మోతాదులో రోజుకి 5-6 సార్లు తినటం మంచిది. మంచి ప్రోటీన్లు గల అల్పాహారంతో రోజుని ప్రారంభించటం మేలు.

======================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.