Tuesday, June 10, 2014

అందమైన చర్మానికి ఏ ఆహారం తీసుకోవాలి ?

  •  



ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము

   Q : అందమైన చర్మానికి ఏ ఆహారం తీసుకోవాలి ?.

జవాబు : ఆరోగ్యం కోసమే కాదు.. అందం కోసమూ చక్కని ఆహారం తీసుకోక తప్పదంటున్నారు నిపుణులు. అందంగా కనిపించాలంటే చర్మం ఆరోగ్యంగా ఉండాలి. మన ఆరోగ్యానికి తొలి సూచిక చర్మమే. చర్మం మంచి నిగారింపుతో ఆరోగ్యంగా ఉండటానికి లోషన్లు, క్రీములు, పౌడర్ల వంటవేమీ పనిచేయవు. అవి పైపై మెరుగులే. సరైన పోషకాహారం తీసుకోకపోతే.. మన శరీరంలో మొదటగా ప్రభావితమయ్యేది చర్మమే.

మొటిమలు
కొవ్వు పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్‌, వేపుళ్లు ఎక్కువగా తింటే మొటిమలు ఎక్కువవుతాయి. తాజాపండ్లు, కూరగాయలు, నీరు బాగా తాగటం ద్వారా మొటిమల్ని తగ్గించుకోవచ్చు. ఒత్తిడి కూడా చర్మంపై ప్రభావం చూపించి మొటిమలు రావటానికి కారణమవుతుంది. అందుకని, శుభ్రత పాటించటంతో పాటు యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉండే ఆహార పదార్థాల్ని ఎక్కువగా తీసుకోవాలి. గ్రీన్‌టీ, పొద్దుతిరుగుడు గింజలు, స్ట్రాబెర్రీ, దానిమ్మ వంటివాటిలో యాంటీఆక్సిడెంట్లు బాగా లభిస్తాయి.

వృద్ధాప్యం లో : 
వయసు మీదపడిన కొద్దీ చర్మం మృదుత్వాన్నీ, నిగారింపును కోల్పోతూ సాగిపోతుంటుంది. సన్నని గీతలూ, మడతలూ వచ్చి చేరుతుంటాయి. మానసిక ఒత్తిడులు, ఎండలో ఎక్కువగా తిరగటం వంటివన్నీ ఇలాంటి వృద్ధాప్య ఛాయల్ని పెంచుతాయి. విటమిన్‌సీని సరిపడినంతగా తీసుకోవటం ద్వారా మడతల్ని తగ్గించుకోవచ్చు. ఒమెగా-3, 6 కొవ్వు ఆమ్లాలు తీసుకోవటం ద్వారా కోల్పోయిన చర్మ నిగారింపును పొందవచ్చు. చేపల్లో ఇలాంటి కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. సాఫ్లవర్‌ నూనె, ముడి ధాన్యాలు, అవిసె గింజల్లో ఒమెగా ఆమ్లాలు లభ్యమవుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్‌-సి, ఇ ల్లో లభ్యమయ్యే యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. నిమ్మ జాతి పండ్లను తినటం ద్వారా విటమిన్‌సీని సమృద్ధిగా పొందవచ్చు. ఆలివ్‌ నూనె, నూనె గింజలు, పాల కూర వంటివాటిలో విటమిన్‌-ఇ లభ్యమవుతుంది.

పొడిబారి, పొట్టులేచే చర్మం :
మీకు పొడి చర్మం ఉన్నట్లయితే క్యారట్లు బాగా తినాలి. విటమిన్‌-ఎ, బిలు పొడిబారి పొట్టులేచే చర్మానికి బాగా పనిచేస్తాయి. క్యారెట్లు, చేప నూనె, పాల ఉత్పత్తుల్లో విటమిన్‌-ఎ లభిస్తుంది.ఇక సూర్యరశ్మి సోకినప్పుడు మన చర్మమే విటమిన్‌-బిని ఉత్పత్తి చేసుకుంటుంది.

కళ్ల కింద చారలు :
కళ్ల చుట్టూ ఉండే చర్మం బాగా సున్నితంగా ఉంటుంది. ఈ భాగంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. రక్తనాళాలు సమృద్ధిగా ఉండి, డ్రైనేజీ వ్యవస్థ తక్కువగా ఉంటుంది. దీనివల్ల దెబ్బతినే ముప్పు ఎక్కువ. కళ్ల చుట్టూ చర్మంపై నల్లని వలయాలు లేకుండా, మెరిసే చర్మం కోసం విటమిన్‌-కె సమృద్ధిగా తీసుకోవాలి. ఇది మాంసాహార పదార్థాలు, ఆకుకూరల్లో బాగా దొరుకుతుంది.

 తప్పనిసరి తినవలసినవి ..
చర్మ ఆరోగ్యానికి మాంసకృత్తులు, ఇనుము, జింకు, దండిగా నీరు అవసరం. ప్రొటీన్లు చర్మం ఆరోగ్యకరంగా కనిపించేందుకు తోడ్పడతాయి. పాల ఉత్పత్తులు, కొవ్వు తక్కువుండే మాంసాహారం, పప్పులు వంటి వాటి నుంచి అవసరమైన ప్రొటీన్లు పొందాలి. ఇనుము కోసం పాలకూర తినాలి. ఖనిజాల కోసం బెల్లం తినొచ్చు. చేపల్లో జింకు బాగా లభ్యమవుతుంది. రోజూ కాసింత అల్లం తిన్నా జింకు లభిస్తుంది. చర్మం ఎప్పటికప్పుడు పోషక నష్టాన్ని పూడ్చుకోవటానికి జింకు అవసరం. తృణ ధాన్యాలు, గుడ్లు, వెల్లుల్లి వంటివాటిలో లభించే సెలీనియం కూడా బాగా ఉపకరిస్తుంది.

తినకూడనివి :
సమతుల పోషకాహారం చర్మ నిగారింపుకు తోడ్పడుతుంది. కానీ.. పొగతాగినా, మద్యం తాగినా ఈ ప్రయోజనాలేవీ అందవు. ధూమపానం చర్మంలోని కొల్లాజెన్‌ను దెబ్బతీస్తూ, వృద్ధాప్య ఛాయలు ముంచుకొచ్చేలా చేస్తుంది. పొగతాగే వారిలో నోటిచుట్టూ సన్నని గీతల్లాంటివి ఏర్పడతాయి. వీటిని 'స్మోకర్స్‌ లైన్స్‌' అంటారు. ఆల్కహాలు తాగే వారు సాధారణంగా ఆహారం గురించి పట్టించుకోరు. ఇది చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదముంది. 

. *===========================
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.