Thursday, May 30, 2013

Talking with boys during nights ,రాత్రిళ్లు ఫోనులో అబ్బాయిలతో మాట్లాడుతోంది

  •  




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము .


Ques :మా అమ్మాయికి పదిహేడేళ్లు. ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసింది. బాగా చదువుతుంది. ఐఐటీకి పంపించాలని మావారూ, నేనూ కలలుకంటున్నాం. కానీ తనకి మాత్రం అవేమీ పట్టడం లేదు. ఇలా పరీక్షలు అయిపోయాయో లేదో అలా రిలాక్స్‌ అయిపోయింది. సమస్య అది కాదు. తను రాత్రిళ్లు ఫోనులో అబ్బాయిలతో మాట్లాడుతోంది. లేదంటే, నెట్‌ ముందు గంటల తరబడి కూర్చుంటుంది. 'నీ తీరేం బాగోలేదు, ఫోన్లు మాట్లాడటం ఆపెయ్‌' అంటే మూడ్‌ ఆఫ్‌ చేసుకుంటుంది. 'మీరు అనుకొన్నట్టేం కాదు.. మాది క్లీన్‌ ఫ్రెండ్‌షిప్‌' అంటోంది? అబ్బాయిలతో అలా మాట్లాడకూడదు అని తనకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియడం లేదు?

Ans: ఇప్పుడు యూత్‌లో ఓ ట్రెండ్‌ నడుస్తోంది. ఫేస్‌బుక్‌లో కానీ మరే ఇతర సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లోకానీ ఖాతా లేకపోతే వాళ్లు అసలు యూతే కాదని కుర్రకారు అభిప్రాయం. ప్రతి సంఘటనా ఫేస్‌బుక్‌లో పెట్టాలి. ఆ పోస్టింగులకు బోలెడు లైక్స్‌ రావాలి. లేకపోతే దిగులు. ఇక, ఎస్సెమ్మెస్‌లు ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా సాధారణం.

ఇవన్నీ అటుంచితే టీనేజీ అంటే అటు బాల్యం పోలేదు ఇంకా పెద్దరికం రాలేదు అన్నట్టుగా ఉంటుంది. ఈ వయసులో హార్మోన్ల ప్రభావమూ ఎక్కువే. వాళ్ల మనసు కొత్త స్నేహాలూ, కొత్త సరదాలూ కోరుకుంటుంది. అపోజిట్‌ సెక్స్‌తో మాట్లాడాలి, వాళ్ల నుంచి ప్రశంసలు అందుకోవాలి అన్న ఆరాటమూ సహజం. మారుతున్న కాలాన్నీ, పిల్లల ప్రవర్తననీ తల్లిగా మీరు అర్థం చేసుకోవాలి. కేకలు వేయడం, మందలించడం, సెల్‌ఫోన్‌ లాక్కోవడం, నెట్‌ ఆఫ్‌ చేయడం చేస్తుంటారు చాలామంది. వీటివల్ల పెద్దగా ఫలితం ఉండదని గుర్తుంచుకోండి. అలా కట్టడి చేయడం వల్ల వాళ్లు అన్ని విషయాలూ మీకు చెప్పరు. చెప్పేదొకటి, చేసేదొకటి తరహాగా మారిపోతారు. ఆ పరిస్థితి రాకుండా చూడటం మీ చేతుల్లోనే ఉంది.

మీ అమ్మాయి బాగా చదువుతుంది. ఈ తరం అమ్మాయిలానే ప్రవర్తిస్తోంది. 'నేను మాట్లాడుతోంది కేవలం ఓ ఫ్రెండ్‌తో మాత్రమే' అని గట్టిగా చెబుతుంటే నమ్మి చూడండి. చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పేంటంటే, పిల్లలకు మార్కులెలా వస్తున్నాయి అని ఆరా తీస్తారు. ఎలా చదువుతున్నారనీ తెలుసుకొంటారు. కానీ స్నేహితులెవరు... ఎలాంటి వాళ్లు అని తెలుసుకోరు. నిజానికి ఈ వయసులో టీనేజీ పిల్లలకు ఒక అమ్మ కన్నా ఓ ఫ్రెండ్‌ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే అమ్మే స్నేహితురాలిగా ఉంటే మంచిది కదా! ఫ్రెండ్‌తో చెప్పుకొనే కష్టం, సుఖం అమ్మతోనే పంచుకొంటారు. స్వేచ్ఛగా అన్ని విషయాలూ చర్చిస్తారు. తనతో అమ్మ హోదాలో కాకుండా ఒక ఫ్రెండ్‌లా మారి మాట్లాడండి. రాత్రిళ్లు అబ్బాయిలతో మాట్లాడటం వల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందో చూచాయగా తెలియచెప్పండి. వీలుంటే ఫోన్లలో మాట్లాడే స్నేహితులని సరదాగా ఇంటికి తీసుకురమ్మని అడగండి. తనన్నట్టుగా వాళ్ల మధ్య క్లీన్‌ ఫ్రెండ్‌షిప్‌ ఉంటే ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొస్తుంది. లేదూ, అలా ఒకరిద్దరి గురించి ప్రస్తావన తీసుకొచ్చే వాతావరణం లేకపోతే 'మీ గ్యాంగ్‌ని ఇంటికి తీసుకురా, టీ పార్టీ ఇద్దాం' అని చెప్పండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ వయసులో పిల్లలని మందలిస్తే రివర్స్‌ అవుతారు. వాళ్ల దారిలోకి వెళ్లి మాట్లాడితే అన్ని విషయాలూ స్వేచ్ఛగా పంచుకుంటారు. ఇది టీనేజర్ల పాలిట తల్లిదండ్రులు పాటించాల్సిన వేదం అనుకోండి!

courtesy with Dr.poornima Nagaraj@Eenadu vasundara
  • =========================== 
visit my website - > Dr.Seshagirirao-MBBS -

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.