Monday, February 25, 2013

నీరసం వస్తుంది కారణం ఏమిటి? నివారణమార్గాలు తెలియజేయండి, What is the cause for Feeling weakness ?




ప్రతిఒక్కరికి సందేహాలు(doubts)ఉంటాయి.కొన్ని సందేహాలు తెలికపోయినా పరవాలేదు.ఆరోగ్యవిషయములో ఉన్న సందేహాలు అందరికీ తెలియకపోవచ్చును.ఒకరికి కలిగిన సందేహమే ఇంకెంతోమందికి కలగవచ్చును. అలా వచ్చే కొన్ని సందేహాలకు జవాబులు చెప్పేప్రయత్నమే ఈ బ్లాగ్ ముఖ్యఉద్దేశము . 



ప్ర : కాసేపు ఇంటి పని చేసే సరికి ఎక్కడలేని నీరసం వస్తుంది కారణం ఏమిటి? నివారణమార్గాలు తెలియజేయండి.

 ఓ గృహిణి సమస్య.

జవాబు : ఏ జబ్బూ లేనప్పుడు ... రక్తహీనత వల్ల తలెత్తిన సమస్యా అన్నది పరిశీలించుకోవాలి. మనదేశంలో ఆడపిల్లలూ, మహిళల్లో ఇది ప్రధాన సమస్యనీ, అవగాహనతో దీనిని అధిగమించవచ్చును.  ఇది వ్యాధి కాదు...ముఖం పాలిపోయినా, తరచూ నీరసంతో కూలబడుతున్నా 'ఒంట్లో శక్తి లేదు, రక్తం లేదు' అనుకోవడం మామూలే! ఒంట్లో తగినంత రక్తం లేకపోవడమే రక్తహీనత అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం తగ్గడం లేదా ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండటాన్ని రక్తహీనతగా పరిగణించొచ్చు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ లెక్కల ప్రకారం రక్తంలో హిమోగ్లోబిన్‌ 12.5 గ్రామ్స్‌/డి.ఎల్‌ ఉండాలి. అది తగ్గుతోంది అంటే రక్తహీనత ఏర్పడుతోందని అర్థం. ఇది ఎలా ఏర్పడుతుంది? ప్రశ్న చిన్నదే. కానీ కారణాలు చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు ఇది పుట్టుకతోనే వచ్చే అవకాశముంది. అవే థలసీమియా, సికిల్‌సెల్‌. అయితే మహిళల్ని ప్రధానంగా వేధించేది అంటే ఇనుము లోపం కారణంగా ఏర్పడే ఎనీమియానే. ఆహారంలో ఇనుమూ, ఇతరత్రా విటమిన్లు లోపించడం వల్ల ఈ రకమైన రక్తహీనత బారిన పడతారు. ఎనీమియా అనేది వ్యాధి కాదు. అదొక ఆరోగ్య పరిస్థితి మాత్రమే. మందులు వాడటం కన్నా చక్కటి ఆహార నియమాలు పాటించడంపైన శ్రద్ధ పెడితే సరిపోతుంది.

గర్భిణులు లలో పుట్టే బిడ్డపైనా ప్రభావం

రక్తహీనత వ్యాధి కాదు. కానీ చెప్పులోని రాయిలా చికాకు పెడుతుంది. తరచూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు గురిచేస్తుంది. రక్తహీనత ఉన్నప్పుడు తరచూ బాగా నీరసంగా అనిపిస్తుంది. ముఖం పాలిపోతుంది. కళ్లు తిరగడం, చేతులూ కాళ్ల వేళ్లు మొద్డుబారడం, పని చేస్తున్నప్పుడు త్వరగా ఆయాసపడిపోతారు. రక్తహీనత మానసికంగానూ ఇబ్బందులకు గురిచేస్తుంది. ఏకాగ్రత కుదరకపోవడం, చిన్న విషయాలకే ఒత్తిడీ, గందరగోళానికి గురవడం
జరుగుతుంది. బి12 లోపం కారణంగా రక్తహీనత ఏర్పడితే మలబద్ధకం, ఆకలి దగించడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

గర్భిణులు రక్తహీనత బారిన పడకుండా చూసుకోవడం చాలా అవసరం. లేదంటే సాధారణ ప్రసవం కాకుండా శస్త్ర చికిత్సకు దారితీసే అవకాశాలు పెరుగుతాయి. పోషకాహారం లోపం, ఎనిమిక్‌గా ఉండటం వల్ల ప్రసవ సమయంలో రక్తస్రావం ఎక్కువ అవడానికీ ఆస్కారముంది. పుట్టే పిల్లలూ త్వరగా ఇన్‌ఫెక్షన్లకు గురవుతారు. దీనివల్ల వాళ్లు ఎదిగే క్రమంలో వివిధ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతారు.

సమస్య ఒక్కటే... కారణాలెన్నో!---

మనదేశంలో చిన్నారులూ, మహిళల్లో రక్తహీనత సమస్య చాలా ఎక్కువ. మూడు నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లల్లో 79 శాతం, పెళ్త్లె పదహారు నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్కుల్లో 60 శాతం దీనితో బాధపడుతున్నారు. గర్భిణుల్లో 70 శాతం దీనివల్ల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఎందుకీ పరిస్థితి అంటే, పనుల్లో పడి వేళకు తినకపోవడం, తిన్నా శరీరావసరాలకు తగిన పోషకాహారం తీసుకోకపోవడాన్ని ప్రధానంగా చెప్పుకోవాలి.

నెలసరులప్పుడు జరిగే అధిక రక్తస్రావమూ ఇందుకు కారణమే. ఎక్కువ మంది సంతానం, మాంసాహారం తినకపోవడం, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వంటివీ రక్తహీనతకు దోహదం చేస్తాయి. 'మూడు పూటలా భోంచేస్తున్నాం, ఏవో ఒక స్నాక్స్‌ తింటూనే ఉన్నాం' నుకుంటూ వూర్కుంటే ఈ సమస్య రాకుండా మానదు. తినాల్సినవి ఎక్కువగా తినాలి. తినకూడనివి మానేయాలి. అప్పుడే దాన్ని ఆమడదూరంలో ఉంచగలం. ఐరన్‌ పోషకాలు ఎక్కువగా ఉండే ఆకుకూరలూ, కాయగూరలూ బాగా తినాలి. ఉప్పూ, కారం ఎక్కువగా ఉండే జంక్‌ఫుడ్‌ తగ్గించాలి. చాలామంది గర్భిణులు కూరలు సహించడం లేదని, పచ్చళ్లు తింటుంటారు. దానివల్ల రక్తహీనత ఏర్పడే అవకాశముంది.

రక్తహీనతను తగ్గించే ఆహారం ---
ఈ మూడూ ముఖ్యం: రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెరిగి, రక్తహీనత రాకుండా ఉండాలంటే తినే ఆహారంలో ఇనుము, బి12, ఫొలేట్‌ పోషకాలు ఉండేట్టుచూసుకోవాలి. తినే ఆహారం నుంచి ఇనుముని సంపూర్ణంగా పొందాలంటే, ఆ పదార్థాలతో పాటూ విటమిన్‌ 'సి'ని కూడా తీసుకోవాలి. ఆకుకూరలూ... ఉసిరి: చికెన్‌ వండుకున్నా, సలాడ్‌ తినాలనుకున్నా వాటిపై నిమ్మ రసం చల్లుకుంటే మంచిది. విటమిన్‌ 'సి' అందించే టొమాటో, నిమ్మ, నారింజ రసాలు ఎక్కువగా తాగాలి. తక్కిన వాటితో పోలిస్తే ఉసిరిలో విటమిన్‌ 'సి' పోషకాలు అధికం. రక్తహీనతతో బాధపడే వారు ఉసిరితో చేసిన పదార్థాలను ఎక్కువగా తినాలి. ఆమ్లా మురబ్బా తింటే ఇంకా మంచిది. అంజీర్‌, మునగాకూ, తోటకూర, పుదీనా, కొత్తిమీర, మొలకలూ బాగా తినాలి.

బి12 లోపిస్తే: ఆహార నియమాలు పాటిస్తూ, పోషకాహారం తింటున్నా కొంతమంది రక్తహీనతకు గురవుతారు. అందుకూ కారణముంది! కాయగూరలు తింటూ, మాంసాహారం అస్సలు తినని వాళ్లు బి12 వల్ల ఎనీమియాకు లోనయినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది. కాయగూరలు బి12ని అస్సలు  అందివ్వకపోవడమే సమస్యకు కారణం. ఇటువంటి వారు, ముఖ్యంగా గర్భిణులు వైద్యుల సలహా మేరకు మాత్రలు తీసుకోవచ్చు. లివర్‌, చేపలూ, గుడ్లూ ఇనుముని పుష్కలంగా అందిస్తాయి.

మాంసకృత్తులు అందేలా: భోజనానికి ముందూ, తరవాత టీ, కాఫీలు తాగకూడదు. వాటిలోని టానిన్లు ఐరన్‌ పోషకాలను శరీరానికి చేరకుండా  అడ్డుకొంటాయి. కొన్నిసార్లు టాబ్లెట్లు వేసుకున్నా ఫలితం కనిపించదు. అలాంటప్పుడు తినే ఆహారంలో పనీర్‌, చీజ్‌, మటన్‌, చికెన్‌, ఫిష్‌, మిల్‌మేకర్‌ వంటి మాంసకృత్తులు అందేలా చూసుకోవాలి. విటమిన్‌ బి6 శరీరంలో జరిగే ఎంజైమ్‌ల చర్యలకు మంచిది. ఈ విటమిన్‌ లోపించిప్పుడు కూడా ఎనీమియా ఏర్పడుతుంది. గర్భిణుల్లో ఏర్పడే ఎనీమియాకి ఐరన్‌ టాబ్లెట్లతో పాటూ బి6ని ఇవ్వడం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయని తాజా అధ్యయనాలు  చెబుతున్నాయి. విటమిన్‌ బి6 పొందాలంటే ఆహారంలో కాబూలీ సెనగలూ, బంగాళాదుంపలూ, దంపుడుబియ్యం ఉండాలి. పాలూ, పెరుగుతో పాటూ పెసలూ, అలసందలూ బాగా తినాలి. పదార్థాలని ఇనుప మూకిట్లో వండుకొంటే మంచిది.


  • =========================== 

visit my website - > Dr.Seshagirirao-MBBS - 

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.