Tuesday, December 28, 2010

పాలిసిస్ట్‌క్ ఒవేరియన్ డిసీజ్ లేదా పి.సి.ఓ.డి,Poly cystic Overian Disease(PCOD)




Q : నా వయసు 22. పెళ్లయి రెండేళ్లవుతోంది. మెచ్యూర్ అయిన నాటి నుంచి పీరియడ్స్ రెండు, మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయి. డాక్టర్ని సంప్రదిస్తే స్కానింగ్ చేసి పి.సి.ఓ.డి వల్ల ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. ఐదు నెలలుగా హార్మోనల్ ఇంజక్షన్స్ ఓవులేషన్... ఇస్తున్నారు. నా ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్లు ఈ ఇంజెక్షన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయపెడుతున్నారు, ఇది నిజమేనా? ఐదు నెలల తర్వాత నా శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. బరువు 75 కేజీలు ఉన్నాను. తలనొప్పి, చెవి నొప్పి విపరీతంగా బాధిస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం సూచించగలరు. - సుగుణ,



A : ఇంతకు ముందు ఎన్నోసార్లు పాలిసిస్ట్‌క్ ఓవరీస్ గురించి మనం తెలుసుకున్నాం. పీరియడ్స్ సక్రమంగా వచ్చే స్ర్తీలలో అండాశయాలలో ప్రతినెలా కొన్ని అండాలు వృద్ధిచెందడం మొదలవుతుంది. వీటిలో అన్నింటికన్నా ఆరోగ్యంగా ఉన్న అండం పరిమాణంలో వేగంగా పెరిగి 12 నుంచి 18 రోజుల మధ్య విడుదల అవుతుంది. మిగిలిన అండాలన్నీ వృధా అయిపోతాయి. కొన్ని సందర్భాలలో ఇలా జరగక మిగిలిన అండాలన్నీ ఎంతో కొంత ఎదిగి అలాగే ఉండిపోతాయి. అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేసిన ప్పుడు ఇవి చిన్న చిన్న నీటి బుడగలుగా లేదా సిస్టుల్లాగ కనపడతాయి. వీటినే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. ఓవరీస్‌లో సిస్టులు ఉండటంతో పాటు అధిక బరువు, ఇరెగ్యులర్ పీరియడ్స్, అవాంఛిత రోమాలు... వంటి సమస్యలు కూడా తోడైనప్పుడు దీనినే పాలిసిస్ట్‌క్ ఒవేరియన్ డిసీజ్ లేదా పి.సి.ఓ.డి. అంటాం. ఇది ఉన్న స్ర్తీలలో ట్యాబెట్లు, ఇంజెక్షన్లు ఇచ్చి ప్రెగ్నెన్సీ కోసం అండం విడుదలను నియంత్రిస్తారు.

ఈ ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు హార్మోన్లకు సంబంధించినవి అయి ఉండటం వల్ల ఇవి డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. ఒక నెలకి మందులు రాయించుకొని డాక్టర్ పర్యవేక్షణ లేకుండా మళ్లీ అదే ట్రీట్‌మెంట్ కొనసాగించిన వారిలో సమస్యలు ఎదుర్కొనక తప్పదు. ఈ ట్రీట్‌మెంట్ వల్ల తలనొప్పి లేదా చెవి నొప్పి వంటి సమస్యలు కలగవు. చెవి ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన సమస్యలు లేదా సైనసైటిస్ వంటి కారణాల వల్ల కూడా తల, చెవి నొప్పి కలగవచ్చు. కాబట్టి మీరు ఇ.ఎన్.టి డాక్టర్ చేత పరీక్ష చేయించుకొని తగిన సూచనలు పొందండి. ఇక పాలిసిస్ట్‌క్ ఓవరీకీ ఎన్నో రకాల ట్రీట్‌మెంట్‌లు ఉన్నాయి.

మొదటిది: ఈస్ట్రోజెన్+ప్రొజెస్టరాన్ కలిపిన ట్యాబ్లెట్లు వాడటం

రెండవది: ప్రొజెస్టరాన్ మాత్రమే కలిగిన ట్యాబ్లెట్లు వాడటం

మూడవది: ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లయితే అండం ఎదుగుదలకు, విడుదలకు ట్రీట్‌మెంట్ తీసుకోవడం

నాలుగవది: పేషెంట్‌కు జీవనశైలిలో మార్పుల గురించిన అవగాహన కలిగించడం

ఐదవది: ట్యాబ్లెట్ల వల్ల ఫలితం లేనట్లయితే ల్యాపరోస్కోపీ ద్వారా ఈ సిస్టులను పంక్చర్ చేయడం

{పతి పేషెంట్‌కు వారి వారి సమస్య తీవ్రతను బట్టి పై చెప్పిన ట్రీట్‌మెంట్లలో ఏది సరియైనదో డాక్టర్ నిర్ణయిస్తారు. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న అందరిలో ట్రీట్‌మెంట్ ఒకేలా ఉండకపోవచ్చు. అందుచేత మీరు మీ స్నేహాతులు, చుట్టుపక్కల వారు చెప్పిన విధంగా లేదా పుస్తకాలు, పేపర్లలో ఎవరి సమస్యలో ఉన్న విధంగా మీ సమస్యను పోల్చుకోకండి. మీకు అనువైన ట్రీట్‌మెంట్‌ను డాక్టర్ సలహా మేరకు వాడి తగిన ఫలితాన్ని పొందండి.

  • ==========================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.