Monday, July 11, 2011

సిఫిలిస్... మళ్లీ వస్తుందా?,Do I get syphilis again after treatment?





Q : నేను కొంతకాలంగా సిఫిలిస్ వ్యాధితో బాధపడుతున్నాను. చికిత్స తీసుకుంటున్నాను. అయితే ఈ వ్యాధి పూర్తిగా నయం కాదని, శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు తిరిగి విజృంభిస్తుందని విన్నాను. ఇది నిజమేనా? ఈ వ్యాధి పూర్తిగా నయం అయ్యే మార్గం తెలియజేయగలరు.


A : ట్రెపోనిమా పాలిడమ్ అనే సూక్ష్మజీవి ద్వారా సిఫిలిస్ వ్యాధి ఒకరి నుండి ఒకరికి అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. ఇది లైంగిక కార్యకలాపాల ద్వారా కూడా ఒకరి నుండి ఒకరికి సంక్రమించవచ్చు. ఈ వ్యాధి లక్షణాలను ప్రాథమికదశలో కనిపెట్టడం కొంచెం కష్టమే. అలాగే రక్తపరీక్షల ద్వారా కూడా ఈ వ్యాధి ప్రాథమిక దశలో బయటపడకపోవచ్చు. సిఫిలిస్ వ్యాధిని ప్రైమరీ, సెకండరీ, టర్షియరీ... సిఫిలిస్‌గా విభజించారు. ప్రైమరీ సిఫిలిస్ దశలో చీముగడ్డ లేదా అల్సర్‌గా ఇది ముక్కు, నోరు, ఛాతీ లేదా జననేంద్రియాలపై కలగవచ్చు. ఈ దశలో ఎక్కువ నొప్పి కాని వేరే ఇతర లక్షణాలు కాని ఉండకపోవడం వల్ల సాధారణంగా చికిత్స జరగకపోవచ్చు. ఈ దశలో చేసిన రక్తపరీక్షలు కూడా సిఫిలిస్ వ్యాధికి నెగిటివ్‌గా రావచ్చు. ఇది ఒకటి నుంచి ఐదు వారాల వరకు కొనసాగి దానంతట అదే తగ్గిపోతుంది. కాని శరీరం లోపల మాత్రం ఈ వ్యాధి దాగి ఉండవచ్చు. ఈ దశ మొదలైన రెండు నుంచి ఆరు నెలల తర్వాత శరీరం మొత్తం ర్యాష్‌లాగ సెకండరీ సిఫిలిస్ బహిర్గతం అవుతుంది. దీనివల్ల కూడా ఇతర సమస్యలు ఉండవు కాబట్టి ఈ దశ కూడా నిర్లక్ష్యానికి గురికావచ్చు. రెండు నుంచి ఆరు వారాలలో ఈ దశ కూడా తగ్గుముఖం పడుతుంది. ఇప్పుడు చేసిన రక్తపరీక్షలలో సిఫిలిస్ వ్యాధిని తప్పక గుర్తించవచ్చు.

లేటెంట్ సిఫిలిస్: ప్రైమరీ, సెకండరీ సిఫిలిస్ వచ్చిన వ్యక్తులలో ఈ వ్యాధి శరీరంలో దాగి ఉండి ఇతరులకు సోకడం లేదా ఆ వ్యక్తికే తిరిగి బయట వ్యాధి రూపంలో కనపడటం ఒక సంవత్సరం కన్నా ఎక్కువ సమయంలో జరిగినప్పుడు దానినే లేటెంట్ సిఫిలిస్‌గా గుర్తిస్తారు.

టర్షియరీ సిఫిలిస్: ఈ దశలో గుండెకు, నరాలకు, కళ్లకు, వినికిడికి సంబంధించిన ఎన్నో సమస్యలను ఈ సిఫిలిస్ కలగచేస్తుంది.

గర్భిణీలలో సిఫిలిస్: గర్భిణిగా ఉన్నవారిలో ఈ వ్యాధి వచ్చినప్పుడు దాని ప్రభావం తల్లి, పిండంపై చాలా తీవ్రంగా ఉండవచ్చు. ఈ వ్యాధి సోకడం వల్ల పుట్టిన బిడ్డకు కాలేయం, స్ల్పీన్, చర్మం, ఎముకలు...వంటి ఎన్నో అవయవాల పనితీరు క్రమంగా ఉండకపోవడాన్ని గమనిస్తాం.

డయాగ్నసిస్: రక్తపరీక్షల ద్వారా ఈ వ్యాధిని ఎంతో సులువుగా గుర్తించడానికి వీలవుతుంది. ఇప్పుడు లేటెస్ట్‌గా చేసే ట్రిపనీమా యాంటీబాడీ టెస్టులు కూడా ఈ వ్యాధిని గుర్తించడానికి, చికిత్స చేయడానికి దోహదపడతాయి.

చికిత్స: పెన్సిలిన్ ఇంజక్షన్లు, టెట్రాసైక్లిన్, ఎరిత్రోమైసిన్ ట్యాబ్లెట్లతో చికిత్స వల్ల ఒకప్పుడు ఎంతో విస్తృతంగా ఉన్న ఈ వ్యాధిని నియంత్రించగలిగాం. అలాగే ప్రాథమిక దశలోనే గుర్తించడం వల్ల సిఫిలిస్ వ్యాధిని మిగతా దశలకు వెళ్లకుండా, దాని ప్రభావం అవయవాలపై పడకుండా కూడా నియంత్రించడం వీలైంది. అందుచేత మీరు చికిత్స పూర్తిగా తీసుకున్నట్లయితే ఈ వ్యాధి పూర్తిగా నయం కాదని, తిరిగి విజృంభిస్తుందని భయాలు పెట్టుకోకండి. భార్యాభర్తలిద్దరూ పరీక్షలు చేయించుకొని చికిత్స చేయించుకోవడం వల్ల ఈ వ్యాధి తిరిగి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.


డాక్టర్ రాధిక--గైనకాలజిస్ట్, నిమ్స్


  • =====================================
visit my website - > Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment

Your comment makes me to improve this blog.