A : యుక్తవయసు దాటిన స్ర్తీలలో గర్భసంచి సుమారు 8 - 9 సెంటీమీటర్ల పొడవు, 5 - 6 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రతి అవయవంలోనూ మనిషి మనిషికీ తేడా ఉన్నట్లే గర్భసంచి పరిమాణం విషయంలో కూడా సుమారుగా 1-2 సెంటీమీటర్ల వరకు కొంత తేడా ఉండొచ్చు. ఈ పరిమాణంలో ఉండే గర్భసంచి ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొద్దీ బరువులో ఎనభై గ్రాముల నుంచి కేజీ వరకు పెరగడాన్ని గమనిస్తాం. అలాగే కొలతలో కూడా 8 నుంచి 9 సెంటీమీటర్లు ఉండే గర్భసంచి ప్రెగ్నెన్సీ సమయంలో 32 - 36 సెంటీమీటర్ల వరకు, కవలలు ఉన్న సందర్భాలలో ఇంకా కొంచెం ఎక్కువ పెరగవచ్చు. దీనిని బట్టి గర్భసంచి సైజు ఎంతగా వ్యాకోచించవచ్చో మీరు గమనించండి.
మీకు గర్భసంచి కొంచెం చిన్నదిగా ఉన్నదని, 4.5 to 5.0 సెంటీమీటర్ల వరకు ఉన్నదని, దాని పెరుగుదలకు మందులు వాడుతున్నారని రాశారు. గర్భసంచి సైజు కొన్ని సార్లు జన్యు ఆధారితంగా నిర్ణయం కాగా, కొన్నిసార్లు హార్మోన్ల లోపాల వల్ల చిన్నదిగా ఉండటం జరగవచ్చు. ఇటువంటి సందర్భాలలో ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్లను నెల నెలా ఇస్తారు. వీటి వల్ల సరైన సైజులో గర్భసంచి పెరుగుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. కాని పనితీరును మాత్రం క్రమబద్ధీకరించడానికి ఈ ట్యాబ్లెట్లు దోహదపడవచ్చు. మీకు గర్భసంచి చిన్నదిగా ఉన్నా పీరియడ్స్ వస్తున్నాయి కాబట్టి మీరు కొంతకాలం పాటు ఈస్ట్రొజెన్, ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్లను డాక్టర్ పర్యవేక్షణలో వాడండి. కోర్స్ అయిపోయిన తర్వాత స్కానింగ్ మళ్లీ చేయించుకొని గర్భసంచి సైజులో ఏమైనా పెరుగుదల ఉన్నదేమో గమనించండి.
స్వల్పంగా సైజు తక్కువగా ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఇబ్బంది కలగకపోవచ్చు. కాని సైజు బాగా తక్కువ ఉన్న పరిస్థితులలో అబార్షన్లు అవడం, నెలలు నిండకుండానే బ్లీడింగ్ అవడం, ప్రీ టెర్మ్ డెలివరీ అయిపోవడం, బరువు తక్కువగా ఉన్న పిల్లలు పుట్టడం... వంటి సమస్యలు తలెత్తవచ్చు. పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చినట్లయితే సహజంగానే ప్రెగ్నెన్సీ వచ్చేందుకు అవకాశం ఉంది.
బయట ఐవిఎఫ్ పద్ధతిలో టెస్ట్‌ట్యూబ్‌లోనే పిండాన్ని ఏర్పరిచినా అది ఎదగవలసింది గర్భసంచిలోనే కదా! మీరు కొన్నాళ్లు ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రానట్లయితే హిస్టరోస్కోపీ పరీక్ష చేయించుకోండి. ముందు పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా చికిత్స తీసుకొని ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించండి.
-డాక్టర్ రాధిక--గైనకాలజిస్ట్, నిమ్స్
- ================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.