Q : బాబు పదవ తరగతి చదువుతున్నాడు. గత ఆరు నెలల నుంచి ఎక్కువసేపు నిద్రపోతున్నాడు. రోజుకు 12, 13 గంటలసేపు నిద్రపోయినా సరిపోనట్టు కనిపిస్తాడు. ఆదివారాలు, సెలవుదినాలలో మరింత ఎక్కువ సమయం నిద్రలో వుంటాడు. అతిగా నిద్రపోవటంవల్ల బరువు పెరుగుతున్నాడు. గతంలో వున్న చురుకుదనం, చలాకీతనం ఇప్పుడు కనిపించడంలేదు. తొమ్మిదవ తరగతి వరకు ఒక ప్రైవేటు కానె్వంటులో చదివించాము. పదవ తరగతి కీలకం కాబట్టి ఒక కార్పొరేట్ సంస్థ నిర్వహించే టెక్నోస్కూల్లో చేర్పించాము. ఇప్పుడు మార్కులు కూడా బాగా తగ్గాయి. ఏమైనా అంటే నాకు ఏకాగ్రత కుదరడం లేదు. చదివింది మరచిపోతున్నానంటాడు. మందలిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. అతన్ని మామూలు మానసిక స్థితికి తెచ్చే మార్గం సూచించండి.
A : మీ బాబు లక్షణాలను బట్టి అతను మానసిక, లేదా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్టు అర్థమవుతున్నది. సాధారణంగా ఆ వయస్సు పిల్లలకు 7 నుంచి 9 గంటల నిద్ర సరిపోతుంది. నిద్ర మరీ ఎక్కువైనా, తక్కువగా ఉన్నా మానసిక, శారీరక సమస్యలున్నట్లు గుర్తించాలి. అంటే 10గంటలకంటే ఎక్కువ, 4 గంటలకంటే తక్కువ నిద్రపోతుంటే ఏవో సమస్యలున్నట్టు భావించాలి. మీ బాబు లక్షణాలను బట్టి, మానసిక స్థితి డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు భావించాల్సి వస్తుంది. 10వ తరగతికి రాగానే మరొక మంచి స్కూల్‌కు మార్పించారు. ఇక్కడి స్టాండర్ట్‌తో అతను సర్దుకోలేకపోవచ్చు. గతంలో కంటే భారం పెరిగి ఉండవచ్చు. ఇతర పిల్లలతో పోల్చుకొని కృంగిపోతుండవచ్చు. భయం, ఆందోళన పెంచుకొని బాధపడుతుండవచ్చు. ఇలా చదువుల ఒత్తిడికి గురై డిప్రెషన్‌కి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అలాగే థైరాయిడ్ సమస్య తలెత్తినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మీ బాబు బాగా బరువు పెరుగుతున్నందున థైరాయిడ్ సమస్య వుండే అవకాశాలు వున్నాయి. కాబట్టి ఆ అబ్బాయి సమస్యను అనునయంతో అడిగి తెలుసుకోండి. మనసు విప్పి మాట్లాడితే అసలు సమస్యలు తెలుస్తాయి. అలాగే డాక్టర్ సలహాతో థైరాయిడ్ టెస్టులు చేయించడం మంచిది. అతిగా ఒత్తిడికి గురైనవారిలో థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం వుంది. అలాగే థైరాయిడ్ సమస్యవల్ల మానసికంగా కృంగిపోవడం జరుగుతుంది. మానసిక సమస్యలైతే సైకాలజిస్టుల ద్వారా కౌనె్సలింగ్ చేయించండి. థైరాయిడ్ సమస్య వుంటే డాక్టర్ సలహా మేరకు మందులు వాడండి.
- ================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.