Q : మా అమ్మాయికి ముప్ఫై ఏళ్లు. ఐదేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఇంకా పిల్లలు లేరు. ఆర్నెల్ల క్రితం మా అమ్మాయిని మా దగ్గర వదిలేసి వెళ్లిపోయాడు. ఎందుకని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు. చివరకు మా అమ్మాయిలో లైంగిక వాంఛలు బాగా తక్కువనే కారణం చెప్పాడు. అమ్మాయిని అడిగితే అన్నింటికీ మౌనంగా ఉంటోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో మాకు తెలియడం లేదు. సలహా ఇవ్వండి.
A : మీ అల్లుడు చెప్పిన దాన్ని బట్టి తనలో లైంగిక వాంఛ లేకపోవడమే సమస్య అయితే దాన్ని పెంచే చికిత్స లేదనే చెప్పాలి. తన ప్రవర్తనకు దారితీసే కారణాలను ఆలోచిస్తే కొందరికి సెక్సంటే భయం ఉండొచ్చు. అది కూడా ఒక్కసారిగా కాకుండా చిన్నతనంలో ఎదురైన భయాలు పెద్దయ్యాకా కొనసాగి అలాంటి ప్రవర్తనకు దారితీయవచ్చు. అయితే కొందరు ఆ భయాలను నిర్భయంగా చర్చించలేక మనసులో దాచుకుని మరింత ఒత్తిడికి లోనవుతారు. అలాంటప్పుడే వైవాహిక జీవితంలో సమస్యల్ని ఎదుర్కొంటారు. అలాగే మీ అమ్మాయికీ, తన భర్తకీ మధ్య చక్కని అవగాహన ఉందా లేదా అన్నదీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొందరు పురుషులు మిగిలిన సమయాల్లో భార్యల్ని పెద్దగా పట్టించుకోకుండా, కేవలం లైంగిక వాంఛలు తీర్చే వ్యక్తిగా పరిగణిస్తారు. దాంతో చాలామంది మహిళల్లో అంతర్లీనంగా కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. దీనివల్ల ఇద్దరి మధ్యా సఖ్యత ఏర్పడదు. మీ అమ్మాయి ఇలాంటి సమస్యతో బాధపడుతోందేమో కూడా పరిశీలించండి. కొన్నిసార్లు చిన్నచిన్న అనుమానాల వల్ల కూడా భార్యాభర్తలు మనస్ఫూర్తిగా దగ్గర కాలేరు. కాబట్టి ముందు మీ అమ్మాయితో ఈ అంశాలన్నీ చర్చించండి. పై వాటిల్లో ఏ ఒక్క కారణమైనా ఉందని తను చెబితే వాళ్లిద్దరి మధ్యా సత్సంబంధాలు పెరిగేందుకు ఏం చేయాలనేది ఆలోచించండి. ఇవన్నీ కాకపోతే హార్మోన్ల మార్పులు కూడా లైంగిక వాంఛల్ని తగ్గిస్తాయి కాబట్టి గైనకాలజిస్టు సలహాతో దానికి సంబంధించిన పరీక్షలూ చేయించండి.
Answer / Dr.Kalpana G singar@eenadu vasundara
- ===========================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.