Q : మా పాపకు పద్దెనిమిది సంవత్సరాలు. వాళ్ల కాలేజ్‌లో లెక్చరర్‌తో ప్రేమలో పడింది. అతడు ఆమెకంటే 11 ఏళ్లు పెద్ద. మా అమ్మాయి నాకు చెప్పిన తరువాత నేను వెళ్లి అతడితో మాట్లాడిన. చాలా మంచి వ్యక్తిలాగా కనిపించాడు. కాకపోతే మా అమ్మాయి వయసు 18 ఏళ్లు మాత్రమే. ఇద్దరి వయసుల మధ్య తేడా ఎక్కువగా ఉంది. ఆ అబ్బాయి వ్యక్తిత్వం చూసిన తరువాత ఇది పెద్ద సమస్య కాదు అనిపించింది. కానీ మా స్నేహితులు, బంధువులు మాత్రం అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఆ బంధం ఎక్కువకాలం నిలబడదు అంటున్నారు. అమ్మాయికి నేను ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మా పాప అతడిని చూడకుండా, మాట్లాడకుండా ఉండాలంటే కాలేజ్ మాన్పించేయాలా? లేదా వాళ్లకు పెళ్లి చేసేస్తే... తరువాత ఏం సమస్యలు వచ్చినా వాళ్ల బాధేదో వాళ్లు పడతారు అని ఊరుకోవాలా? నేను సింగిల్ పేరెంట్‌ను. నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది?
A : మీరు మీ కూతురు, ఆమె ఇష్టపడిన అబ్బాయి మధ్య వయసు తేడా గురించి బాధపడకపోయినా పర్లేదు కానీ... మీ పాప వయసు గురించి మాత్రం ఆందోళన చెందాల్సిందే. ఎందుకంటే కేవలం పద్దెనిమిదేళ్లు ఆమెకి. ఈ వయసులో మంచేదో, చెడేదో తెలియదు. ఇప్పటిదాకా స్కూల్, మీ ఇంటిచుట్టుపక్కల వాతావరణం మాత్రమే చూసి ఉంటుంది. అక్కడ ఉన్న అబ్బాయిల గురించి మాత్రమే తెలుసు ఆమెకు. ఇప్పుడు ఒకేసారి కాలేజ్‌కు వెళ్లేసరికి అందులో కాస్త తెలివైన, మంచిగా ఉన్న వాళ్లను ఇష్టపడొచ్చు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఆమె ఇంట్లో తండ్రి ప్రేమను పొందలేదు. సాధారణంగా తండ్రి ప్రేమ పొందని అమ్మాయిలు బయట అబ్బాయిలకు తొందరగా ఆకర్షితులవుతారు. కొంచెం అందంగా, ఆకర్షణీయంగా ఉన్నా, తెలివికలవాళ్లని వెంటనే ఇష్టపడతారు. ఈ వయసులో పెళ్లి, అందుకు కాబోయే భార్యాభర్తలిద్దరి మధ్య ఉండాల్సిన అవగాహన గురించి అసలే తెలియదు. అభిమానాన్ని, ఆకర్షణను కూడా ప్రేమ అనుకునే వయసు. అందుకే లెక్చరర్‌లో తెలివి, హుందాతనం మీ అమ్మాయిని ఆకర్షించి ఉంటాయి. ఆ అభిమానాన్ని కాస్త ప్రేమగా భావించి ఉంటుంది. అమ్మాయికి పద్దెనిమిదేళ్లే కాబట్టి కనీసం ఇంకో మూడేళ్లపాటు పెళ్లికి ఏం తొందరలేదని చెప్పండి. అప్పటివరకు వాళ్లిద్దరి మధ్య ఆరోగ్యకరమైన స్నేహాన్ని కొనసాగించమని చెప్పండి. ఈ మూడేళ్లలో మీ అమ్మాయి సర్కిల్ పెరుగుతుంది. విశ్లేషించుకునే శక్తి వస్తుంది. జీవితంపట్ల ఓ అవగాహన కూడా వస్తుంది. సమాజంపట్ల ఆమె ఆలోచన పరిధి కూడా పెరుగుతుంది. అప్పుడు ఇంతకుముందు తాను ఇష్టపడ్డ లెక్చరర్ తనకు సరైనవాడేనా, అది నిజమైన ప్రేమేనా అనేది ఆమెకు తెలిసొస్తుంది. ఆ మూడేళ్ల తరువాత కూడా అదే ప్రేమ వాళ్లిద్దరి మధ్య ఉంటే పెళ్లి చేయండి.
- =============================
visit my website - > Dr.Seshagirirao-MBBS
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.