- సుహాసిని, రాజమండ్రి
A : లక్షణాలను బట్టి మీ బాబు క్రానిక్ అబ్డామినల్ పెయిన్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. పిల్లల్లో తీవ్రమైన కడుపునొప్పి తరచూ వస్తూండటానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, లివర్‌కు సంబంధించిన రుగ్మతలు, మూత్ర విసర్జన వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, కొన్ని సందర్భాల్లో కొన్ని విషాలు శరీరంలో వ్యాపించడం (పాయిజనింగ్), శరీర జీవక్రియల్లో (మెటబాలిక్ ఫంక్షన్స్) మార్పులు, మానసిక సమస్యల వల్ల కడుపునొప్పి రావచ్చు.
ఇక మీ బాబు విషయంలో పరీక్షలు చేసి, అవి నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు కాబట్టి పైన పేర్కొన్న కారణాలు అతడి కడుపునొప్పికి కారణం కాకపోవచ్చు. రిపోర్ట్స్‌లో లింఫ్‌నోడ్స్ పెరిగినట్లుగా కనిపిస్తున్నాయి కాబట్టి అతడి సమస్యను మిసెంట్రిక్ లింఫెడినైటిస్‌గా చెప్పవచ్చు. కడుపులో ఏవైనా ఇన్ఫెక్షన్స్ (యెర్సీనియా, స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్లు) వచ్చినప్పుడు, అక్కడి కణజాలం ఏదైనా ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్నప్పుడు ఇలా గ్రంథుల సైజ్ పెరుగుతుంది.
అంతేకాదు... గొంతు, కడుపు, కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, అపెండిసైటిస్‌లో కూడా లింఫ్ గ్రంథుల సైజ్ పెరుగుతుంది. ఈ పరిస్థితి రెండు నుంచి పదేళ్ల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మధ్యమధ్యన ఎలాంటి లక్షణాలు కనిపించకుండా ఉండటం, మందులు వాడగానే నొప్పి తగ్గడం వంటివి చూస్తుంటే దీన్ని నాన్-స్పెసిఫిక్ లింఫెడినైటిస్‌గా చెప్పవచ్చు. అంటే ఇది అంత తీవ్రమైనది కాదని తెలుస్తోంది. అయితే చాలా అరుదుగా ట్యూబర్క్యులోసిస్ ఉన్నప్పుడు కూడా గ్రంథులు పెద్దవి కావచ్చు. అయితే అలాంటి పిల్లల్లో దీనితో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఎవరికైనా సరే... నొప్పి లేకుండా గ్రంథుల పరిమాణం 15 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా పెరుగుతుంటే మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి. అలాంటప్పుడు అది తీవ్రమైన, దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన పరిస్థితి కావచ్చు
మీ అబ్బాయికి మరికొన్ని రోజులు ఆగి మరోసారి స్కాన్ తీసి చూడాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సమస్య తీవ్రతను అంచనా వేయడం మంచిది. దాదాపు 80 శాతం నుంచి 90 శాతం పిల్లల్లో గ్రంథుల సైజ్ దానంతట అదే తగ్గిపోతుంది. అలా తగ్గకపోతే సీటీస్కాన్, అవసరమైన సందర్భాల్లో వాటి బయాప్సీ చేసి వాటి పెరుగుదలకు కారణం ఏమిటో చూడాల్సి ఉంటుంది. ఈలోపు మీ బాబుకు మీ డాక్టర్ సలహా మేరకు నొప్పి నివారణ మందులు, యాంటిబయాటిక్ కోర్సు వాడితే సరిపోతుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మీరు మీ పీడియాట్రీషియన్ ఆధ్వర్యంలో బాబుకు తగిన చికిత్స చేయించండి. పిల్లల్లో ఈ పరిస్థితిని నివారించాలంటే... అన్‌పాశ్చరైజ్డ్ పాలు, సరిగా ఉడికించని ఆహారం (ముఖ్యంగా మాంసా హారం), శుభ్రంగా లేని నీళ్లు వాడకూడదు.
డాక్టర్ దాసరి రమేష్‌బాబు--పిడియాట్రీషియన్,--కేర్ ఆసుపత్రి
- ============================================
No comments:
Post a Comment
Your comment makes me to improve this blog.